ఆ'పాత' మధురాలు - అపురూప రుచులు.. !!ఇనుపగంటె యాది ....
~~~~~~~~~~~~~
ఇనుపగంటె గురించి చెప్పాల్నంటె
పొంటె చెప్పిన, అయిపోనంత చరిత్ర !
వెనుకట--
పచ్చిపులుసు చేసినా
పలుచటిపప్పు చేసినా
పప్పుచారు కలవోసినా...
కొసమెరుపు ఇనుపగంటెతోనే !
కట్టెలపొయ్యిల ఎర్రటి నిప్కల మీద
ఇనుపగంటె వెట్టి, పావెడు నూనెవోసి,
పోసిత్తులు, ఆవాలు, జిలుకర
ఎల్లిపాయ & కల్యామాకు వేసి
పోసువెట్టి, వాసన గుమాయించంగనే
ఇంతాంత పసుపేసి అటీటు కదిలిచ్చి
గంటెదీసి పులుసులవెట్టి మూతవెట్టి
ఎర్రగకాలిన ఇనుపగంటెను అమాంతం
పులుసులముంచి... సుర్రుమనిపిద్దురు.
పచ్చిపులుసు అయిందంటే చాలు
అలువాటైన పానం అంగడంగడి..అని
పిల్లలం కంచం పట్టుకోని
కాలుగాలిన పిల్లికూన లెక్కన
అమ్మకాళ్లల్ల అడ్డమడ్డం తిరిగేవాళ్లం !
ఆ రోజులు మళ్లరావు,
ఆ ఙ్ఞాపకాలూ మరుపురావు...!
అవి... ఆ'పాత' మధురాలు - అపురూప రుచులు.. !!
~•~•~•~•~•~
ఈ రోజులల్ల ఎవరింట్లనైనా...
ఇనుపగంటె చూద్దామన్న కంటికి కనవడుతలేదు.
ఒకప్పుడు ఆ గంటె లేకుంట పూటగడువకపోయేది.
నిన్న నడి అడవిల ఉన్న ఓ మూలగోటు పల్లెకు పోతే--
అక్కడ మా శిష్యురాలు ఇంటివెనుక దడికి చెక్కబడి,
పూర్తిగ చిలుముదిని, అనుముచెడి పక్కన పడివుంది...!
పున్నం ఎన్నీల కొన్నొద్దులు - అమాస చీకటి కొన్నొద్దులు.
మీరైనా, నేనైనా ఏంజేస్తం ! జరిగేదాన్ని మాత్రమె చూస్తం...!!
~డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
Asst.Prof. of Telugu, Govt Degree College (w), Karimnagar.
ఆ రోజులు మళ్లరావు,
ఆ ఙ్ఞాపకాలూ మరుపురావు...!
అవి... ఆ'పాత' మధురాలు - అపురూప రుచులు.. !! మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసారు రచయిత Asst.Prof. సంపత్ కుమార్ గారు ...... venkt
0 Comments