తెలంగాణ ర్యాలపూల వంటలు తిండ్లు

~~~~~~~~~~~~~~
ఎండకాలంల దొరికే అడవిపంట... ర్యాలెపూలు !
ఇది చైత్ర & వైశాఖ మాసాలల్ల మెట్టభూముల్ల
గుత్తులుగుత్తులుగ చెట్టునిండ విరగబూసి
చల్లటి చలువతోటి.. కండ్లకు పండుగజేస్తది.
గోగుపూలతోటి మనకు వసంతోత్సవమైతే,
ర్యాలపూలతోటి కేరళీయులకు వసంతోత్సవం !
మన కొండరెడ్లు కూడా ర్యాలపూల పండుగజేస్తరు.
ర్యాలకూ-మనకూ పాతచుట్టిర్కం ఇక్కన్నే కలుస్తది.
ర్యాలపూలే కాదు, కాయలకూ మంచి ఖదరే ఉన్నది.
ర్యాలకాయలు తిన్న నక్క ఊలవెట్టినట్టని... సామెత !
ర్యాలెపూల గుత్తులు దూసుకచ్చి, ఆ పూలతోటి
పచ్చెడ, కారప్పప్పు పొడికూర,మెత్తటి పప్పుకూర,
పప్పుచారు, గారెలు, పకోడీలు వేసుకునుడూ చేస్తరు.
ఇవన్నీ మా దగ్గర పాత సంప్రదాయకమైన వంటలే.. !
ఎండకాలంల మనకు వడదెబ్బ తాకకుంట కాపాడే
చల్లటి చలువగుణం ఈ ర్యాలపూలకు ఎక్కువ గనుక
ఈ పూలంటే... మనకూ వెన్కటినుంచి మంచి మక్కువనే !
మా ఊరుపక్కన్నే, మూడో ఊరుపేరు-- ర్యాలెపెల్లి !
నిన్ననే నా కోరికమేరకు మా కొలీగ్ మిత్రుడు చంద్రశేఖర్
ఈ ర్యాలపెల్లి పక్కనున్న తమ తాటిపల్లిల మల్లెగుట్టనుంచి..
ఇగో ! ఈ ర్యాలపూలగుత్తులు కవరునిండ నింపుకచ్చిండు.
(మల్లెగుట్టకు తప్పకుంట ఉంటయని గట్టిగ చెప్పిన మరి)
ర్యాలపల్లి నుండి వచ్చిన ర్యాలపూల తోటి--
తొక్కు పచ్చెడ & కారపుపప్పు పొడికూర చేసుడేగాక
చుట్టుపక్కల నలుగురికి కూడా.. పూలు పంచిపెట్టినం.
మల్లోసారి తెమ్మని.. ఇగ చారు, గారెలు చెయ్యవలసిందే.. !
ర్యాలపూల వంటలు రుచికి రుచి & ఆరోగ్యానికి ఆరోగ్యం.. !!
మనం ఆరుబయటికి వచ్చి, ఊరిబయటికి తొంగిచూస్తే--
గుట్టలకూ, బోర్లకూ ఎక్కడనో ఓ కాడ, ర్యాలపూల జాతర
మీకు తప్పకుంట కండ్లవడుతది. తెచ్చి వండుర్రి మరి.
మన తెలంగాణ తిండితీరు నలుగురికి తెలిసెటట్టుగ...!!
✍డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్